Kartika Purnima – Telugu
- Posted by Sri Kameswari Foundation
- Date November 20, 2023
- Comments 0 comment
కార్తీక పౌర్ణమి – ప్రాముఖ్యత
కార్తీక మాసములో వచ్చే పౌర్ణమిని “కార్తీక పౌర్ణమి” అంటారు.కార్తీక పౌర్ణమి రోజున ఈ క్రింద పేర్కొనబడిన పనులు విశేషమైన పుణ్యమును కలుగజేస్తాయి:
1.పుష్కర స్నానం
2.గోదానం
3.వృషోత్సర్జనం
4.దీప ప్రజ్వలనం (త్రిపురోత్సవం)
5.అరుణాచల దీప దర్శనం
6.కార్తికేయదర్శనం
పుష్కర స్నానం మరియు గోదానం
పద్మపురాణమును అనుసరించి:
విశాఖాసు యదా భానుః కృత్తికాసు చ చంద్రమాః |
స యోగః పద్మకో నామ పుష్కరేష్వపి దుర్లభః ||
పద్మకం పుష్కరే ప్రాప్య కపిర్లాం యః ప్రయచ్ఛతి |
స హిత్వా సర్వపాపాని వైష్ణవం లభతే పదం || [1]
ఏ యోగంలో అయితే సూర్యూడు విశాఖ నక్షత్రంలో,చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉంటారో,దానిని పద్మక యోగం అంటారు.పద్మక యోగంలో ఎవరైతే పుష్కర ప్రాంతములో కపిల గోవును దానం చేస్తారో,వారి పాపములు పరిహరింపబడి విష్ణు లోకమును పొందుతారని చెప్పబడుతోంది.
మరొక స్మృతి యందు
కార్త్తిక్యాం పుష్కరే స్నాతః సర్వపాపైః ప్రముచ్యతే |
మాఘ్యాం స్నాతః ప్రయాగే తు ముచ్యతే సర్వకిల్బిషైః || [2]
ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున,పుష్కరము(రాజస్థాన్) నందు పుణ్య స్నానమును ఆచరిస్తారో; వారికి సమస్తమైన పాపములు నశిస్తాయి.అలాగే మాఘమాసములో వచ్చే పౌర్ణమి నాడు ప్రయాగ తీర్థములో స్నానమాచరించిన వారి యొక్క పాపములు కూడా నశిస్తాయని చెప్పబడినది.
కార్తీక మాసములో రాజస్థాన్ లోని పుష్కర ప్రాంతములో పుష్కరమేళాను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది పర్యాటకులు ఆ మేళాను సందర్శిస్తారు. ఆవులను,గుర్రాలను,ఒంటెలను,గాడిదలను అక్కడ వేలం వేస్తారు.వాటిని కొనుగోలు చేయటానికి యాత్రికులు అక్కడకి పెద్దసంఖ్యలలో రావటం మరో విశేషం.
వృషోత్సర్జనం
మత్స్యపురాణము ననుసరించి:
కార్త్తిక్యాం యో వృషోత్సర్గం కృత్వా నక్తం సమాచరేత్ |
శైవం పదమవాప్నోతి శివవ్రతమిదం స్మృతం || [3]
కార్తీకమాసములో వృషోత్సర్జనం చేయటం ద్వారా శివానుగ్రహాన్ని పొంది,కైలాసము చేరుతారని చెప్పబడుతోంది.దీనినే శివవ్రతం అని కూడా అంటారు.ఆవుని/ఎద్దుని దానం చేయటాన్ని వృషోత్సర్జనం అంటారు.కొన్ని ప్రాచీన గ్రంథాలలో ఒక ఎద్దుని,ఆవుని,దూడని దానం చేయాలని చెప్పబడింది. ఆశ్వీయుజ మాసములో రోహిణీ నక్షత్రము ఉన్న సమయంలో మరియు ఎవరైనా వ్యక్తి చనిపోయిన 10వ రోజున కూడా పుణ్యప్రదమైన వృషోత్సర్జనమును చేయవచ్చు.
త్రిపురోత్సవము
ధర్మ శాస్త్ర గ్రంథమైన,భార్గవార్చన దీపికను అనుసరించి:
పౌర్ణమాస్యాం తు సంధ్యాయాం కర్తవ్యస్త్రిపురోత్సవః |
దద్యాదనేన మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే || [4]
కార్తీక పౌర్ణమి రోజున సంధ్యాసమయములో దేవాలయములో దీపమును వెలిగించి ఈ క్రింది శ్లోకమును పఠించాలి:
కీటాః పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే యే విచరంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినో భవంతి నిత్యం శ్వపచా హి విప్రాః || [5]
కీటకములు,పక్షులు,మనుష్యులు,చెట్లు- ఇలా భూమి మీద,నీటి మీద,గాలిలో ఉన్న సమస్తమైన జీవులలో,వేటి మీద ఈ కార్తీక పౌర్ణమి నాటి దీపపు వెలుగు పడుతుందో,వాటికి మోక్షప్రాప్తి కలుగుతుందని అర్థం.ప్రతి జీవుడిని ఉద్ధరించగలిగిన సాంప్రదాయములను కలిగినటువంటి విశాల ధర్మము-సనాతన ధర్మమని; ఈ విషయము నుంచి తెలుసుకోవచ్చు.
అరుణాచల – దీప దర్శనం
అరుణాచలం – తిరువణ్ణామలైగా కూడా పిలువబడే ఈ ప్రాంతం,తమిళనాడులోని ఒకానొక ప్రముఖ పట్టణం.
పవిత్రమైన ఐదు పంచభూతలింగాలలో,ఇది కూడా ఒకటి.ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమిచ్చాడు.అరుణాచలేశ్వరుని యొక్క కథ మనకు స్కాందపురాణములోని మాహేశ్వరఖండములో “అరుణాచల మహాత్యము” తెలుపుతుంది.
ఒకానొకసారి బ్రహ్మ,విష్ణువు మధ్యన వారిద్దరిలో ఎవరు అధికులు అన్న విషయం మీద వివాదం ఏర్పడింది.ఆ పోరు పెద్దదై,సామన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తుండగా,శివుడు అక్కడ ఒక పెద్దజ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడు.బ్రహ్మ,విష్ణువుల యొక్క ప్రార్థన మేరకు శివుడు జ్యోతిస్తంభ రూపం నుండి ఒక కొండగా మారాడు – అదే ఈ నాడు మనము పిలిచే అరుణగిరి/అరుణాచలం.తరువాతి కాలములో,ఒక దేవాలయమును నిర్మించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు.ప్రళయకాల పర్యంతము అరుణగిరి గుహలలో,ఎల్లవేళలా కనీసం ఒక సాధకుడైనా తపస్సును ఆచరిస్తుంటారని చెప్పబడుతోంది.
నక్ష్త్రే కృత్తికాఖ్యేస్మిన్ తేజస్తే దృశ్యతాం పరం |
తద్వీక్షితమిదం తేజఃపరం ప్రతివత్సరం ||
దృష్ట్వా సమస్తైర్దురితైర్ ముఛ్యతాం సర్వజంతవః |
తథేతి దేవదేవేన ప్రోఛేథాంతర్దధే గిరౌ || [5]
కార్తీక పౌర్ణమి రోజున,అరుణాచల పర్వతము మీద దీపమును వెలిగించాలని,ఆ దీపమును దర్శించివారి పాపములు నశిస్తాయని శివుడే స్వయంగా చెప్పాడు.అందుకే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు కార్తీక పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
కార్తికేయ దర్శనం
కాశీఖండము నందు –
కార్తిక్యాం కృత్తికాయోగే యః కుర్యాత్స్వామిదర్శనం |
సప్తజన్మ భవేద్విప్రో ధనాఢ్యో వేదపారగః || [6]
కార్తీక మాసములో,కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి నాడు,శివ పార్వతుల పుత్రుడైన కార్తికేయుడిని అనగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించంటం ఎంతో పుణ్యప్రదమని చెప్పబడుతోంది.అందుకే మనకి కార్తీక పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా భక్తుల కోలాహలంతో దర్శనమిస్తాయి.
ప్రస్తావనలు
[1] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.311
[2] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.311
[3] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.311
[4] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.312
[5] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.312
[6] భట్, S. (2018). నిర్ణయసింధు (2వ ఎడిషన్) [సంస్కృతం మరియు హిందీ]. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్, ముంబై. Pg. నం.312