Back

శివుడితో ముచ్చట్లు – శివుడిచ్చేది కావాలా,శివుడే కావాలా?

 

ఓ శివ!కాస్త నీళ్ళు పోసి,ఒక మారేడు దళం వేసినా చాలు,తేలికగా అనుగ్రహించే దేవుడివి అని “భోళశంకరుడు” అన్న నామంతో నిన్ను అందరూ కొనియాడుతుంటారు.మిగిలిన స్వరూపాలను పూజించాలన్నా,వాళ్ళ అనుగ్రహం పొందాలన్న చాలా కష్టము అంటుంటారు.

నువ్వు అనుగ్రహించే మాట నిజమేలే కానీ;ఇక్కడ నాకు ఒక సందేహం కలిగింది.శివానుగ్రహం అంటే శివుడు ఏదన్న ఇవ్వటమా లేక శివుడే రావటమా?

నాకు నీ కథలను పరిశీలిస్తే;అలా కొంచెం నీళ్ళు పోసి,పత్రి వేస్తే నువ్వు కోరికలు తీరుస్తావు కానీ;నువ్వయితే రావు అనిపిస్తుంది.

నువ్వే కావాలి అని అనుకున్నవారిని నువ్వు పరీక్షించినంతగా ఇంకే స్వరూపము పరీక్షించలేదు.ఏమి పరీక్షలయ్యా తండ్రీ!

నిన్ను పరిణయమాడదామనుకున్న మా అమ్మ “ఉమాదేవి” తపస్సులో తనను తాను మర్చిపోయి నీకోసమే పరితపిస్తుంటే,తన దగ్గరకు వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చి నిన్ను నువ్వే నింద చేసుకుని,ఆవిడకి కూడా కోపం తెప్పించి,ఏది ఏమయినా శివుడే తన భర్త అని ఆవిడ ధృఢంగా నిశ్చయించుకున్నదని అనిపించాక అనుగ్రహించావు.

మరొకసారి ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావ వృత్తాంతంలో,అన్నిటికీ నీవే దిక్కు అనుకున్న ఘుష్మ కొడుకు ముక్కలు ముక్కలుగా నదిలో పడి ఉన్నా నువ్వు రాలేదు!రోజు చేసుకునే విధంగానే మృత్తికా లింగాలకు పూజ చేసి,వాటిని నదిలో కలుపుతున్నప్పుడు తన కొడుకు శరీరాన్ని చూసి కూడా చలించక,నువ్వు ఏమి చేసినా అది ధర్మమే అని అనుకొని మృత్తికా లింగాలను నీటిలో కలుపుతుంటే అప్పుడు వచ్చి అనుగ్రహించావు. 

ఇంకొకమారు,తిన్నడు తన బతుకు ఏదో తాను బతుకుతుంటే,నీ మీద ప్రేమ కలిగించావు.నీ పట్ల ఎంతటి ప్రేమని పొందాడంటే,నీ కంటి కోసం తన కన్ను సమర్పించితే అప్పుడు వచ్చావు;కన్నప్పని అనుగ్రహించావు.

మరో నాయనారు కథ వింటే,ఏమిటి నీ పరీక్ష-ఇంత కఠినాత్ముడివా అనిపిస్తుంది,అదే సిరుతొండ(చిరుతొండ) నాయనార్ వృత్తాంతం.శివభక్తులకు భోజనం పెడితే తప్ప తాను భుజించను అనుకున్న ఆ భక్తుని చేత తన కొడుకునే వండించి నీకు సమర్పించాక,నీ స్వస్వరూపాన్ని చూపించి వారందరిని అనుగ్రహించావు.

ఇలా చెప్పుకుంటూ పోతే,చాలానే ఉన్నాయి – నువ్వే కావాలనుకున్నవాడిని నువ్వు ఎంత పరీక్షిస్తావు అని తెలుసుకోవడానికి.

ఇంకో మాట చెప్పాలంటే – నీ స్వరూపాన్ని పూజించటం తేలిక, మిగిలిన వారి కన్నా అంటారు.భలే మాయావివి నువ్వు – అన్ని మాయలకు ఆద్యుడువు నువ్వు అయితే,పెద్ద మాయావి అని విష్ణువుకు పేరోచ్చింది.

నువ్వు అరూపరూపిగా – లింగాకారంలో ఉంటావు.లింగానికి స్నానం చేయించటం తేలిక,బట్ట కట్టటం తేలిక,ఎక్కువ ఆభరణాలు వెయ్యక్కర్లేదు,అందంగా కనపడటానికి ఇంకేదన్నా పెద్ద పెద్ద అలంకారాలు చెయ్యాలా – అదీ అక్కర్లేదు.

మరి మిగిలిన స్వరూపాలకి పూజ అంటే – స్నానానికి ముందు ఒక బట్ట కట్టాలి,జాగ్రత్తగా స్నానం చేయించాలి,మళ్ళీ అందమైన వస్త్రాలంకారం చేయాలి,అందమైన ఆభరణాలు వేయాలి,నఖ-శిఖ పర్యంతము అలంకారాలు చేయాలి; ఎన్నో ఉంటాయి.

ఆకారాన్ని బట్టి సేవ ఉంటుంది కదా!నువ్వు చక్కగా బ్రహ్మాండమంతా నాలోనే ఉంది అని చెప్పటానికి లింగంలా కూర్చున్నావు,వాళ్ళనేమో సాకారంగా అలా ఉంచావు.తెలివి నీదయితే,నిందలు వేరే వాళ్ళకి ఇచ్చావు.కానీ వాళ్ళు వాళ్ళ భక్తులను ఇంకెవరైనా ఇబ్బంది పెడతారేమో అని,ముందుగానే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

దూర్వాస మహాముని వల్ల అంబరీషుడికి కష్టము కలుగుతుందేమో అని శ్రీమహావిష్ణువు ఎప్పుడోనే ఆయన చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో ఉంచాడు.

ఇక జగదంబ అయితే;భక్తులు వేడిందే తడవుగా వచ్చేస్తుంది,వాళ్ళని అనుగ్రహిస్తుంది. మహాచతుఃషష్ఠికోటియోగినీగణసేవితా అన్న నామము యొక్క వ్యాఖ్యానమును సాకారముగా భాస్కరాచార్యులవారు కోరిందే తడవుగా నిరూపించిన ఘట్టం ఒకటి చాలదా,ఆవిడ కారుణ్యం చెప్పటానికి.

అయినా భక్తలోకంలో నువ్వే అశుతోషుడివి,భోలేనాథుడివి.ఏమిటయ్యా నీ చమత్కారం!

నువ్వు ఇచ్చేది కావాలంటే,నిన్ను పూజించి పొందటం తేలిక కావచ్చునేమో కానీ నువ్వే కావాలి అంటే – అంత తేలిక కాదు.

అయినా ఏముందయ్యా నీలో?

శ్రీమహాలక్ష్మి తనదైన శ్రీమహావిష్ణువు,జగత్తు అంతటికీ తల్లియైన శ్రీమతా తపస్సు చేసి – నీ దేహంలో అర్థభాగాన్ని పొందారు.సృష్టిని రక్షించి,పోషించే వారికి కూడా నిన్నే పొందాలి అనిపించటం నీ యొక్క ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది.

సప్తఋషులు తపస్సులో ఉన్న ఉమాదేవి దగ్గర నిన్ను నిందిస్తూ మాట్లాడిన ఘట్టం,మహాదేవుడివైన నీ అనుగ్రహం కోసం ఎంతటి పనినైనా చేయిస్తుంది అని తెలియజేస్తుంది.

క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం లోకాలను మింగేస్తుంటే;నీవే దిక్కని నిన్ను శరణు వేడితే హాలాహలభక్షణం చేసిన ఘట్టం లోకములకు తండ్రిగా నీ రక్షకత్వాన్ని తెలియజేస్తుంది.

అన్నీ నీవైనవాడివి,అన్నిటిలోనూ ఉన్నవాడివి,అందరి వాడివి నువ్వే. నిన్ను అర్థం చేసుకుని,నువ్వే కావాలి అని అనుకున్న జీవుడే ధన్యుడు.

ఓ తండ్రీ!ఈ భావం బుద్ధిలో కుదురుకుని,నీ సంపూర్ణానుగ్రహానికి పాత్రత కల్పించు.