Mahalaya Pakshamu-Telugu
- Posted by Sri Kameswari Foundation
- Date November 16, 2023
- Comments 0 comment
జ.భాద్రపదమాస కృష్ణపక్షములో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినట్లయితే ఆ పక్షమునకు మహాలయపక్షమని పేరు.
జ.భాద్రపదమాస కృష్ణపక్షములో సూర్యుడు ఏ తిథినాడు కన్యారాశిలో ప్రవేశించినప్పటికీ పక్షము మొత్తము శ్రాద్ధమునకు ప్రశస్తమైనదని శాస్త్రవచనము.
జ.తత్ర బృహన్మనుః-
మధ్యే వా యది వాప్యన్తే యత్ర కన్యాం రవిర్వ్రజేత్
స పక్షః సకలః పూజ్యః తత్ర శ్రాద్ధం విధీయతే ॥
పక్షము మొదటిలోకానీ,మధ్యలో కానీ,చివరిలో కానీ సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినట్లయితే ఆ పక్షము మొత్తము పూజ్యమైనదని, పితరులనుద్దేశించి శ్రాద్ధమును చేయాలని తెలుస్తోంది.
అత్ర బృహన్మనుః-
ఆషాఢీమవధిం కృత్వా పంచమం పక్షమాశ్రితాః
కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్॥
ఈ విధముగా కన్యాసంక్రమణమైన భాద్రపదకృష్ణపక్షము అత్యంత-శ్రేష్ఠమైనదని తెలుస్తోంది. అందుచేతనే శాట్యాయని ఋషిచేత
పుణ్యః కన్యాగతః సూర్యః పుణ్యః పక్షస్తు పంచమః
కన్యస్థార్కాన్వితః పక్షః సో-త్యన్తం పుణ్య ఉచ్యతే ॥
అని చెప్పబడింది.అంటే భాద్రపదకృష్ణపక్షము సహజముగా పుణ్యమైనది.ఆ పక్షములో సూర్యుడు కన్యారాశిలో ఉన్న కాలము మహాలయాది పితృకార్యములకు అత్యంత పుణ్యమైనదని అర్థము.
జ.కన్యాసంక్రమణము జరగకపోయినా భాద్రపదకృష్ణపక్షము పుణ్యమైనదని,మహాలయశ్రాద్ధము చేయవలెనని “చతుర్వర్గచింతామణి” అనే గ్రంథములో,చెప్పబడింది.
జ.భవిష్యత్పురాణములో-
కన్యాం గతే సవితరి పితృరాజ్ఞో-నుశాసనాత్
తావత్ ప్రేతపురీ శూన్యా యావద్వృశ్చికదర్శనమ్॥
తతో వృశ్చికమాయాతే నిరాశాః పితరో నృప
పునః స్వభవనం యాన్తి శాపం దత్త్వా సుదారుణమ్ ॥
అని చెప్పబడింది.
అలాగే జాతుాకర్ణిచే-
ఆకాంక్షంతి స్మ పితరః పంచమం పక్షమాశ్రితాః
తస్మాత్తత్రైవ దాతవ్యం దత్తమన్యత్ర నిష్ఫలమ్ ॥
పితృదేవతలందరూ భాద్రపదకృష్ణపక్షమును ఆశ్రయించుకొని ఉంటారు.కన్యాసంక్రమణం నుంచి తులాసంక్రమణం వరకు భూలోకములో పితృదేవతలున్నప్పటికీ ముఖ్యకాలముగా భాద్రపదకృష్ణపక్షమును చెప్పడం వల్ల తులా సంక్రమణము గౌణ కాలమని తెలుస్తోంది. అందుచేత భాద్రపదకృష్ణపక్షం మహాలయ పక్షముకు శ్రేష్ఠమని చెప్పబడుతోంది.
జ.ఎలా అయితే అమావాస్యనాడు చేసే శ్రాద్ధమును అమాశ్రాద్ధమంటారో అలాగే మహాలయపక్షములో చేసే శ్రాద్ధమును కూడా మహాలయశ్రాద్ధమంటారని శాస్త్రగ్రంథములలో కనిపిస్తోంది.
జ.మహాలయశ్రాద్ధము రెండు రకములు:1.పక్షమహాలయము 2.సకృన్మహాలయము
జ.భాద్రపదకృష్ణపక్షము యొక్క పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజూ చేసే మహాలయశ్రాద్ధమును పక్షమహాలయశ్రాద్ధమని అంటారు.
జ.భాద్రపదకృష్ణపక్షములో ఏదో ఒక రోజున ఒక మహాలయశ్రాద్ధమును చేసిన సకృన్మహాలయము అని అంటారు.
జ.మహాలయ పక్షంలో వచ్చు 15 తిథులలో రోజుకి ఒకటి చొప్పున 15 శ్రాద్ధములు. పక్షమహాలయ శ్రాద్ధ విధానంగా పెట్టే క్రమంలో ఏదైనా ఒకరోజు తిథి ప్రమాణం ఎక్కువగా ఉన్నచో (తిథి వృద్ధి) 16 శ్రాద్ధములు,తిథి ప్రమాణం తక్కువగా ఉన్నచో(తిథి క్షయం) 14 శ్రాద్ధములు చేయవలెను.
అలా చేయలేనివారు పంచమి నుండి, షష్ఠినుండి, అష్టమినుండి లేక ఏకాదశినుండి మొదలుపెట్టి అమావాస్య వరకు ప్రతిరోజు శ్రాద్ధమును చేయాలి.అలాకూడా చేయలేకపోతే భాద్రపదకృష్ణపక్షములో ఏదో ఒక రోజున సకృన్మహాలయమును చేయాలి.
జ.సకృన్మహాలయము చేసేటప్పుడు విడిచిపెట్టవలసిన తిథి-నక్షత్ర-వారములు శాస్త్రమందు ఈ విధముగా చెప్పబడ్డాయి.
నందాయాం భార్గవదినే త్రయోదశ్యాం త్రిజన్మసు
ఏషు శ్రాద్ధం న కుర్వీత గృహీ పుత్రధనక్షయాత్॥
ప్రాజాపత్యే చ పౌష్ణే చ పిత్రర్క్షే భార్గవే తథా
యస్తు శ్రాద్ధం ప్రకుర్వీత తస్య పుత్రో వినశ్యతి ॥
సకృన్మహాలయములో విడిచిపెట్టవలసిన తిథి-నక్షత్ర-వారములు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి
తిథులు | నక్షత్రాలు | వారములు |
1.పాడ్యమి | 1.జన్మనక్షత్రం | 1.మంగళవారము |
2.షష్ఠీ | 2.రోహిణీ | 2.శుక్రవారము |
3.ఏకాదశి | 3.మఖ | |
4.చతుర్దశి | 4.రేవతి | |
5.జన్మనక్షత్రము నుండి 10 మరియు 19వ నక్షత్రం |
జ.సాధారణముగా తండ్రి ఏ తిథినాడైతే మరణించారో; అంటే చైత్రం మొదలైన ఏ నెలలోనైనా,శుక్ల-కృష్ణపక్షములలోని పాడ్యమి మొదలైన తిథులలో;ఏ తిథినాడైతే తన తండ్రి మరణించారో (విదియ,తదియ మొదలగు) ఆ తిథినాడు భాద్రపదకృష్ణపక్షములో సకృన్మహాలయశ్రాద్ధమును చేయాలి.
ఉదాహరణఃతండ్రి జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు మరణించినట్లయితే,భాద్రపదకృష్ణపక్షములో తదియ నాడు సకృన్మహాలయశ్రాద్ధమును చేయాలి.
జ.పాడ్యమి,షష్ఠీ,ఏకాదశి తిథులను నందా తిథులు అంటారు. కాబట్టి ఆయా తిథి , వార, నక్షత్రముల నిషేధం సకృన్మహాలయము చేసేటప్పుడు వర్తించదు.
జ.తండ్రి మరణించిన తిథినాడు శ్రాద్ధము చేయుటకు నిషిద్ధతిథివారాదులను పట్టించుకోకుండా మహాలయమును చేయాలి.ద్వాదశీ, అమావాస్యా, అష్టమీ తిథులలో, భరణీ నక్షత్రములో, వ్యతీపాత యోగములో సకృన్మహాలయశ్రాద్ధమును చేసేటప్పుడు తిథి-నక్షత్ర-వార నియమములను పట్టించుకోవక్కర్లేదు.
జ.అపరాహ్ణకాలములో ద్వాదశతిథి ఉండగా మాత్రమే సంన్యాసికి మహాలయమును చేయాలి.
ప్రమాణ శ్లోకముః
సంన్యాసినో-ప్యాబ్దికాది పుత్రః కుర్యాద్యథావిధి
మహాలయే తు యచ్ఛ్రాద్ధం ద్వాదశ్యాం పార్వణం తు తత్॥
అపరాహ్ణం: 1. పగటిని మూడు భాగాలు చేస్తే అందులో చివరిది.
- రోజును ప్రాతః, సంగమ, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయం కాలాలనే ఐదు భాగాలు చేస్తే నాలుగవ భాగం.
జ.మహాలయశ్రాద్ధము ప్రతిసంవత్సరము చేస్తున్నందు వల్ల నిత్యమని కొందరు,కృష్ణ-పక్షములో మాత్రమే చేస్తున్నందువల్ల నైమిత్తికమని కొందరు చెప్పుచున్నారు.
జ.సాధారణముగా శ్రాద్ధము ఏకోద్దిష్ట-పార్వణ భేదముచే ద్వివిధము.శ్రాద్ధము నిత్య-నైమిత్తిక- కామ్యభేదముల వల్ల మూడురకాలుగా ఉన్నది.మరొకవిధముగా నిత్య-నైమిత్తిక-కామ్యముల యందలి భేదము వల్ల శ్రాద్ధము 12 రకములుగా ఉన్నది.
జ.1. నిత్యశ్రాద్ధమ్
ప్రతిరోజూ చేయదగిన నిత్య- శ్రాద్ధము.ఈ శ్రాద్ధము అధర్మకము.అంటే బ్రహ్మచర్యాదినియమములు లేని శ్రాద్ధము.నిత్యశ్రాద్ధము చేయలేకపోతే నిత్యపితృతర్పణమునైనా చేయాలి.
2.నైమిత్తికశ్రాద్ధమ్
వ్యక్తి మరణించిన రోజు మొదలుకొని 11 వ రోజు వరకు చేసే నవ శ్రాద్ధాదులు.వ్యక్తి మరణించిన రోజు నుండి 11 వ రోజు వరకు బేసి దినములలో అనగా 1-3-5-7-9-11 రోజులలో చేయు “నవం” అను పేరు గల శ్రాధ్ధములను నవశ్రాద్ధములు అంటారు.ఆశౌచ అనంతరం 11 వ రోజు చేసే ఆద్యము అను పేరుగల శ్రాద్ధము.షోడశ శ్రాద్దములు(11 వ రోజు చేయునవి) ఇవి అన్నీ ఏకోద్దిష్ట విధానంగా చేయవలెను.ఏకోద్దిష్టమును విశ్వేదేవ,విష్ణురహితముగా, ప్రాచీనావీతిగా చేయవలెను.
3.కామ్యశ్రాద్ధమ్
ఏదో ఒక కోరికతో చేసే శ్రాద్ధమును కామ్యశ్రాద్ధమంటారు.ఈ శ్రాద్ధమును పార్వణవిధానముగా చేయవలెను.ధురి – విలోచన సంజ్ఞకులు విశ్వేదేవులు.
ఆయా శ్రాద్ధ కర్మను బట్టి విశ్వేదేవుల నామములు మారుతూ ఉంటాయి.
ఉదా : నామ భేదం చెప్పని పార్వణ శ్రాద్ధములన్నింటిలో పురూరవ – ఆర్ద్రవ సంజ్ఞకులు విశ్వేదేవులు.
కామ్య – తీర్థ – మహాలయ శ్రాద్ధములలో ధురి – విలోచన సంజ్ఞకులు విశ్వేదేవులు.
సపిండీకరణ శ్రాద్ధము యందు కాల – కామక సంజ్ఞకులు విశ్వేదేవులు.
నాందీ శ్రాద్ధము యందు సత్య – వసు సంజ్ఞకులు విశ్వేదేవులు.
- వృద్ధిశ్రాద్ధమ్
ఉపనయన,వివాహములలో చేసే నాందీశ్రాద్ధము.వృద్ధికోసం చేసే శ్రాద్ధము కాబట్టి వృద్ధిశ్రాద్ధమని అంటారు.
- సాపిండ్యశ్రాద్ధమ్
వ్యక్తి మరణించిన రోజు నుండి 12వ రోజు నాడు చేయు సపిండీకరణ శ్రాద్ధమునే సపిండ శ్రాద్ధము లేదా సాపిండ్య శ్రాద్ధము అంటారు.
- పార్వణశ్రాద్ధమ్
పర్వణి భవం పార్వణమ్ అని అని పార్వణ పదముకు వ్యుత్పత్తి.అలాగే అమావాస్యను “దర్శ” అని కూడా అంటారు.ఇక్కడ సందర్భాన్ని బట్టి “ పర్వణి ” అనగా కూడా అమావాస్య అనే అర్థం తీసుకోవాలి.కావున అమావాస్య ( దర్శ ) అను పర్వములో చేయు శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధం అంటారు.
- గోష్ఠీశ్రాద్ధమ్
ఎక్కువమంది బ్రాహ్మణులు కలసి తీర్థయాత్రలకు వెళ్ళినపుడు,అక్కడ వేరు వేరుగా వంటను చేసుకుని శ్రాద్ధమును (ప్రతిఒక్కరు తీర్థశ్రాద్ధమును) చేయుటకు కుదరకపోతే;అందరూ కలసి చేయుశ్రాద్ధమును గోష్ఠీశ్రాద్ధమని శాస్త్రమందు చెప్పబడినది.
- శుద్ధిశ్రాద్ధమ్
చిత్తశుద్ధిని కలిగించేవి, పాపమును పోగొట్టేవి అయిన ప్రాయశ్చిత్తములలో పూర్వోత్తరాంగముగా చేసే వైష్ణవశ్రాద్ధము మొదలైనవాటిని శుద్ధిశ్రాద్ధములు అంటారు.
- కర్మాంగశ్రాద్ధమ్
నిషేక-సోమయాగ-పుంసవన-సీమంతసంస్కారములకు అంగముగా చేసే నాందీశ్రాద్ధమునకు కర్మాంగశ్రాద్ధమని పేరు.
- దైవికశ్రాద్ధమ్
దేవతలనుద్దేశించి సప్తమ్యాదితిథులలో చేసే శ్రాద్ధము.
- యాత్రాశ్రాద్ధమ్
యాత్రలకు వెళ్ళేముందు, యాత్రపూర్తి అయ్యి స్వగృహమునకు వచ్చిన తరువాత చేసే శ్రాద్ధము.
- పౌష్టికశ్రాద్ధమ్
శరీరారోగ్యసిద్ధికై, ధనాభివృద్ధికై చేసే శ్రాద్ధమును పౌష్టికశ్రాద్ధము అంటారు.
ఈ ద్వాదశవిధశ్రాద్ధములలోని నిత్య-నైమిత్తిక-కామ్యభేదమును కార్ష్ణాజినిఋషి ఈ విధముగా చెప్పారుః
మృతాహే-హరహర్దర్శే శ్రాద్ధం యచ్చ మహాలయే
తన్నిత్యముదితం సద్భిర్నిత్యవత్తద్విధానతః॥
ప్రేతశ్రాద్ధం సపిండత్వం సంక్రాంతిగ్రహణేషు చ
సంవత్సరోదకుంభం చ వృద్ధిశ్రాద్ధం నిమిత్తతః॥
తిథ్యాదిషు చ యచ్ఛ్రాద్ధం మన్వాదిషు యుగాదిషు
అలభ్యేషు చ యోగేషు తత్కామ్యం సముదాహృతమ్॥
నిత్యశ్రాద్ధములు
మృతాహశ్రాద్ధము (ప్రత్యాబ్దికము), దర్శశ్రాద్ధము (పార్వణశ్రాద్ధము), మహాలయశ్రాద్ధము అనేవి నిత్యశ్రాద్ధములు.
నైమిత్తికశ్రాద్ధములు
ప్రేతశ్రాద్ధము, (ఆద్య,షోడశాదికము) సపిండీకరణము, గ్రహణ-సంక్రమణములలో చేసే శ్రాద్ధము, సంవత్సరశ్రాద్ధము, ఉదకుంభ-శ్రాద్ధము, వృద్ధిశ్రాద్ధము అనేవి నైమిత్తికశ్రాద్ధములు.
కామ్యశ్రాద్ధములు
తిథులయందు, మన్వాదులయందు, యుగాదులయందు, అలభ్య-యోగములయందు చేయదగిన శ్రాద్ధములు కామ్యశ్రాద్ధములు.
జ.ఆదిత్యపురాణముననుసరించి– మహాలయపక్షములో యముడు పితృదేవతలను యమపురి నుండి విడిచిపెట్టునని, మనుష్యలోకమునకు చేరిన పితృదేవతలు తమ పుత్రపౌత్రులనుండి పాయసము,నెయ్యి మొదలైన పదార్థములతో కూడిన అన్నమును కోరుకుంటారని, అందువలన ఎంతటి దీనుడైనా పాయసాది పదార్థములతో శ్రాద్ధమును పితృదేవతలకై తప్పక చేయాలని చెప్పబడింది.
జ.
ఆషాఢ్యాః పంచమే పక్షే యః శ్రాద్ధం న కరిష్యతి
శాకేనాపి దరిద్రో-పి సో-న్త్యజత్వముపేష్యతి॥
ఆసనం శయనం భోజ్యం స్పర్శనం భాషణం తథా
తేన సార్ధం న కర్తవ్యం హవ్యం కవ్యం కదాచన
అర్థము- ఎంతటి దీనుడైనా మహాలయపక్షములో శ్రాద్ధము చేయాలని, శక్తిలేకపోతే శాకములతోనైనా శ్రాద్ధమును చేయాలని,అలా చేయకపోతే శూద్రత్వమును పొందుతాడని, అటువంటి-వానిచే సహశయ్యాసనాదులు చేయరాదని, హవ్య, కవ్యములందు అతనిని విడిచిపెట్టాలని నాగరఖండాంతర్గత వచనములయొక్క అర్థము.
జ.నిర్ణయసింధువులో ఇలా చెప్పబడింది – ఇదం చ నిత్యం కామ్యం చ పుత్రానాయుస్తథారోగ్యమైశ్వర్యమతులం తథా ప్రాప్నోతి పంచమే దత్వా శ్రాద్ధం కామాన్ సుపుష్కలాన్|
భాద్రపదమాసకృష్ణపక్షములో మహాలయము చేసినచో విశేషమైన ఫలములు కలుగును.
నిత్యమా? కామ్యమా?అన్న సందేహానికి కాలనిర్ణయచంద్రికలో- ఏవం మహాలయకరణాకరణే బహుధా ఫలప్రత్యవాయశ్రవణాత్ మహాలయశ్రాద్ధస్య నిత్యకామ్యత్వం గమ్యతే
అత ఏవోక్తం-
మహాలయాదికం సర్వం నిత్యం కామ్యం విశిష్యతే
తస్మాదకరణే తస్య ప్రత్యవాయో మహాన్భవేత్॥
కరణాదిష్టసిద్ధిశ్చ భవిష్యతి న సంశయః॥
అని చెప్పబడింది.
కామ్యము ప్రధానముగా చెప్పినప్పటికీ నిత్యత్వము కూడా ఉన్నదని హేమాద్రిచే ఇట్లు చెప్పబడినది-
యత్తు మార్కండేయపురాణాదిషు ప్రతిపద్ధనలాభాయ ద్వితీయా పశుసంపదే ఇత్యాదిభిః వచనైః అపరపక్షాంతర్గతాసు తిథిషు ప్రత్యేకం ఫలసంబంధ ఉక్తః న తేన అపరపక్షే శ్రాద్ధస్య నిత్యతా హీయతే దర్శపూర్ణమాసవత్ నిత్యత్వ-కామ్యత్వయోరుపపత్తేః||
కాబట్టి భాద్రపదకృష్ణపక్షములో చేసే మహాలయశ్రాద్ధము నిత్యము మరియు కామ్యమని కూడా శాస్త్రవచనముల ద్వారా తెలుస్తోంది.
జ.భాద్రపదకృష్ణపంచమి నుండి ఆశ్వయుజ శుద్ధ-పంచమి వరకు మహాలయమును చేయవచ్చును. అది కూడా కుదరకపోతే, సూర్యుడు కన్యారాశిలో ఉన్నంత వరకు శ్రాద్ధమును చేయవచ్చును.ఆ సమయములో కూడా వీలుపడకపోతే సూర్యుడు తులారాశిలో ఉన్నంత వరకు కృష్ణపక్షములో మహాలయశ్రాద్ధమును చేయవచ్చును.
పైన చెప్పిన దానికి ప్రమాణము పితృమేధసారములో ఇలా ఉన్నది-
కన్యాపరపక్షే మహాలయే కథంచిచ్ఛ్రాద్ధాకరణే తులాయాం
వా-పరపక్షే మహాలయం కుర్యాదకరణే మహాన్ దోషః॥
తులారాశిలో సూర్యుడున్నకాలములో కూడా మహాలయము చేయకపోతే పితృదేవతలు శపిస్తారని పురాణవచనము.
పితృపక్షం ప్రతీక్షంతే గురూవాంఛాసమన్వితాః
ప్రేతపక్షే వ్యతిక్రాంతే యావత్కన్యాగతో రవిః॥
తతస్తులాగతే-ప్యేతే సూర్యే వాంఛంతి మానవ
తస్మిన్నపి వ్యతిక్రాంతే కాలే వృశ్చికగే రవౌ॥
నిరాశాః పితరో దీనాస్తతో యాంతి నిజాలయమ్॥
జ.అవును.సకృన్మహాలయమును కానీ పక్షమహాలయమును కానీ అన్నముతోనే చేయాలి.
జ.హిరణ్య-ఆమ-చటక విధానములుగా మహాలయశ్రాద్ధమును చేయకూడదు.
జ.సామాన్యముగా చౌల-ఉపనయన-వివాహములు చేసిన 3-6-12 నెలలవరకు పిండదానము- మృత్తికాస్నానము-తిలతర్పణము చేయరాదనే నియమము ఉన్నప్పటికీ,కింద చెప్పిన ప్రమాణము చేత పిండప్రదానమును కూడా చేయవలెనని తెలుస్తోంది.
తీర్థే సంవత్సరే ప్రేతే పితృయాగే మహాలయే పిండదానం ప్రకుర్వీత యుగాదిభరణీమఘే॥
మహాలయే గయాశ్రాద్ధే మాతాపిత్రోః క్షయేహని కృతోద్వాహోపి కుర్వీత పిండనిర్వాపణం సదా॥
జ.మహాలయశ్రాద్ధమందు ధురి-విలోచన సంజ్ఞకులను విశ్వేదేవులుగా పూజించాలి.
జ.ప్రమాణ శ్లోకముః
ఆదౌ పితా తథా మాతా సాపత్నీజననీ తథా
మాతామహాస్సపత్నీకాః ఆత్మపత్నీ త్వనంతరమ్॥
సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులాస్సహభార్యకాః
దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయకః॥
పితృష్వసా మాతృష్వసా జామాతా భావుకస్స్నుషా
శ్వశురశ్యాలకశ్వశ్రూః స్వామినో గురురిక్థినః॥
పై శ్లోకమునందు చెప్పబడిన దేవతలయందు 4 వర్గములున్నవి.
- పితృవర్గము 2. మాతృవర్గము 3. సపత్నీకమాతామహవర్గము 4. కారుణ్యవర్గము
దీనిలో ప్రధానంగా పితృ-మాతృ-సపత్నీకమాతామహులకు చేయాలి. అందువల్లే మహాలయశ్రాద్ధము నవదైవత్యమని శాస్త్రములో చెప్పబడింది.
జ.మహాలయశ్రాద్ధము నవదైవత్యమను చెప్పు ప్రమాణములుః
ఆదౌ పితా తథా మాతా సాపత్నీజననీ తథా
మాతామహాస్సపత్నీకాః ఆత్మపత్నీ త్వనంతరమ్॥
సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులాస్సహభార్యకాః
దుహితా భగినీ చైవ దౌహిత్రో భాగినేయకః॥
పితృష్వసా మాతృష్వసా జామాతా భావుకస్స్నుషా
శ్వశురశ్యాలకశ్వశ్రూః స్వామినో గురురిక్థినః ॥
మహాలయే గయాశ్రాద్ధే వృద్ధౌ చా-న్వష్టకాసు చ
నవదైవత్యమత్ర స్యాదన్యత్ షట్పురుషం విదుః ॥
చతుర్వర్గచింతామణిననుసరించిః
ఏతచ్చ శ్రాద్ధం నవదైవత్యం కర్తవ్యమ్ ఆహ ధర్మః –
మహాలయే గయాశ్రాద్ధే వృద్ధౌ చాన్వష్టకాసు చ
నవదైవత్యమత్ర స్యాచ్ఛేషం షాట్పౌరుషం విదుః॥
శేషం షోడశశ్రాద్ధాదివ్యతిరిక్తం శ్రాద్ధమ్ ఆహ కాత్యాయనః-
కర్షూసమన్వితం ముక్త్వా తథాద్యం శ్రాద్ధషోడశమ్
ప్రత్యాబ్దికం చ శేషేషు పిండాస్స్యుః షడితి స్థితిః॥
నిర్ణయసింధువందు మహాలయశ్రాద్ధము ద్వాదశదైవత్యమను చెప్పు ప్రమాణముః
మహాలయే గయాశ్రాద్ధే వృద్ధౌ చాన్వష్టకాసు చ
జ్ఞేయం ద్వాదశదైవత్యం తీర్థే ప్రౌష్ఠే మఘాసు చ॥
ధర్మసింధువందు సకృన్మహాలయశ్రాద్ధమును సర్వదైవత్యముగా చేయమని చెప్పబడింది.
ఈ విధముగా మహాలయమున ద్వాదశదైవత్యమును ప్రతిపాదించు శ్లోకములు, నవదైవత్యమును ప్రతిపాదించు శ్లోకములు ప్రామాణికమైన గ్రంథములలో ఉదహరింపబడుటచేత అన్నియూ ప్రమాణములే.
జ.శిష్టాచారమందు పక్షమహాలయమును చేయువారు నవదైవత్యముగా, సకృన్మహాలయమును చేయువారు ద్వాదశ-దైవత్యముగా శ్రాద్ధమును చేయుచున్నారు. కొన్ని గ్రంథములలో శక్తి ఉన్నవారు ద్వాదశదైవత్యముగా, శక్తిలేనివారు నవదైవత్యముగా చేయవలెనని చెప్పబడింది. స్మృతిలో భేదములు ఉండుట చేత మనకి శిష్టాచారమే ప్రమాణము. కాబట్టి పక్షశ్రాద్ధమున నవదైవత్యము, సకృన్మహాలయమున ద్వాదశదైవత్యముగా శ్రాద్ధము చేయాలి.
జ.పక్షమహాలయవిషయమందు పక్షత్రయము (3 విధానములు) చెప్పబడింది.
1.పితృవర్గ-మాతృవర్గ-మాతామహవర్గసహితముగా ఆత్మపత్న్యాది సర్వేకారుణ్యపితరులనుద్దేశించి చేయుట.
2.సపత్నీక పితృవర్గ-సపత్నీక మాతామహవర్గ యుక్తమైన షట్ దైవతముగా చేయుట.
3.సపత్నీక పితృవర్గ-సపత్నీక మాతామహవర్గ యుక్తమగా ఆత్మ-పత్న్యాదిసర్వేకారుణ్యపితరులను ఉద్దేశించి చేయుట.
జ.కారుణ్యవర్గములో ఎవరు మరణించినారో వారికే శ్రాద్ధము. వారిలో పుత్రులు లేనివారికి విశేషముగా చేయాలి.శక్తి ఉంటే ఆత్మపత్న్యాది స్థానములయందు ఒక్కొక్క “బ్రాహ్మణున్ని” నిమంత్రించాలి. లేకపోయినట్లయితే కారుణ్యవర్గమునంతటిని ఉద్దేశించి ఒక బ్రాహ్మణుని నిమంత్రించి ఏకోద్దిష్ట- విధానముగా పూజించాలి.విష్ణువును కూడా తప్పక పూజించాలని శాస్త్ర-వచనము.
జ.సర్వశ్రాద్ధములలో కూడా తప్పక విష్ణుస్థానము ఉండాలని సుధీవిలోచనమందు చెప్పబడింది. విష్ణుస్థానవిషయమున దేవలవచనము ప్రమాణము.
తత్ర దేవలః-
దైవాద్యం నైవ కుర్వీత దైవాన్తం నైవ కుత్రచిత్
దైవాద్యన్తం హి కుర్వీత శ్రాద్ధం మరణహేతునా॥
అర్థముః-దైవాద్యమనగా శ్రాద్ధమందు విశ్వేదేవార్చనమాత్రము చేసి విష్ణ్వర్చన చేయకుండా ఉండుట. దైవాన్తం అనగా పిత్రర్చన చేసిన తరువాత విశ్వేదేవార్చన చేయుట.ఇట్లు కేవల దైవాదిగా లేక కేవల దైవాంతముగా శ్రాద్ధమును చేయరాదు.దైవాద్యన్తం అనగా ముందు విశ్వేదేవార్చన చేసి, తరువాత పిత్రర్చన చేసి చివరిలో విష్ణ్వర్చన చేయాలి.విశ్వేదేవాదిగా శ్రాద్ధమును ఆరంభించి, మధ్యలో పిత్రర్చనచేసి విష్ణ్వంతముగా పూర్తి చేయాలని శ్లోకార్థము.
ఈ విధముగా ధురివిలోచన సంజ్ఞకులైన విశ్వేదేవతలు,పితృ-మాతృ-సపత్నీకమాతామహ-ఆత్మ పత్న్యాదిసర్వేకారుణ్య-విష్ణుస్థానముల యందు బ్రాహ్మణులను నిమంత్రించి మహాలయశ్రాద్ధమును చేయాలి.
జ.సపత్నీమాత అంటే సవితితల్లి.మహాలయములో సపత్నీమాతృ-స్థానమందు ఒక విశేషముంది.తల్లి బ్రతికియుండగా సపత్నీమాతకు మహాలయశ్రాద్ధము చేయవలసి వస్తే సపత్నీమాతృస్థానమును విడిగా పెట్టాలి.ఏకోద్దిష్టముగా చేయాలి,పార్వణముగా చేయరాదు.అంటే కేవలము సపత్నీమాతనుద్దేశించి మాత్రమే శ్రాద్ధము.పితామహ్యాదులతో కలిపి చేయరాదు.ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది సపత్నీమాతలున్నప్పటికీ వారందరికి కలిపి ఒకే బ్రాహ్మణుని నిమంత్రించాలి.అర్ఘ్యము మాత్రము విడివిడిగా ఇవ్వాలి.అందరినుద్దేశించి ఒక పిండమునే ఇవ్వాలి.
తల్లి చనిపోయిన తరువాత చేసే మహాలయములో మాతృ-సాపత్నీమాతలకు కలిపి ఒకే స్థానమందు బ్రాహ్మణని నిమంత్రించాలి.అర్ఘ్యము, పిండము కూడా ఒక్కొక్కటియే ఇవ్వాలి.తల్లిచనిపోయిన తరువాత సాపత్నీమాతృస్థానమును విడిగా చేయరాదు.
జ.సకృన్మహాలయములో శ్రాద్ధాంగతర్పణము తర్వాతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే చెయ్యాలి. పక్షమహాలయశ్రాద్ధములో లేక పంచమి నాటి నుండి మొదలుపెట్టి చేసే మహాలయ శ్రాద్ధములలో శ్రాద్ధానంతరమే (విప్రవిసర్జనానంతరము)శ్రాద్ధాంగతర్పణము చేయాలి.
ప్రమాణము-
పక్షశ్రాద్ధం యదా కుర్యాత్తర్పణం తు దినే దినే
సకృన్మహాలయే చైవ పరేహని తిలోదకమ్॥
జ.పార్వణవిధానముగా చేసే మహాలయశ్రాద్ధమును అపరాహ్ణ-వ్యాపిని అయిన తిథియందు చేయాలి. శ్రాద్ధభేదమువలన కాలభేదము ధర్మశాస్త్రములో విశేషముగా చెప్పబడింది.
ప్రమాణము-
ఆమశ్రాద్ధం తు పూర్వాహ్ణే ఏకోద్దిష్టం తు మధ్యమే
పార్వణం చాపరాహ్ణే తు ప్రాతర్వృద్ధినిమిత్తకమ్॥
అర్థముః- ఆమశ్రాద్ధమును పూర్వాహ్ణమున, షోడశశ్రాద్ధములు, శస్త్రహతచతుర్దశీశ్రాద్ధము మొదలైన ఏకోద్దిష్టశ్రాద్ధములు మధ్యాహ్నమున, యుగాదిశ్రాద్ధములు, మన్వంతరాదిశ్రాద్ధములు, దర్శ-
మహాలయ-అష్టకా మొదలైన పార్వణశ్రాద్ధములు అపరాహ్ణములో, వృద్ధిశ్రాద్ధమును ప్రాతఃకాలములో చేయాలి.అపరాహ్ణ-వ్యాపిని అయిన తిథియందు చేయదగిన శ్రాద్ధములు స్కాందపురాణములో ఇలా చెప్పబడ్డాయి-
మన్వాదౌ చ యుగాదౌ చ తథా శ్రాద్ధే మహాలయే
వ్యతీపాతే చ వైధృత్యాం అపరాహ్ణానుయాయినీ॥
తిథి అపరాహ్ణవ్యాప్తిగా ఉండుట 6 విధములుః
- ముందురోజు అపరాహ్ణవ్యాప్తిగా ఉండుట
ముందురోజు అపరాహ్ణవ్యాప్తిగా ఉంటే ఆరోజే శ్రాద్ధమును చేయాలి.అంటే ముందురోజు పంచమి మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోతే పంచమి తిథినాడు చేయవలసిన శ్రాద్ధమును ముందురోజు చేయాలి.
- తర్వాతిరోజు అపరాహ్ణవ్యాప్తిగా ఉండుట
తర్వాతిరోజు అపరాహ్ణవ్యాప్తిగా ఉంటే శ్రాద్ధమును ఆరోజే చేయాలి.అంటే ముందురోజు సాయంత్రం 7 గంటలకు పంచమి ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతే అపరాహ్ణవ్యాపిత్వం ఉన్న మరుసటి రోజే శ్రాద్ధమును చేయాలి.
- రెండురోజులు అపరాహ్ణవ్యాప్తిగా ఉండుట
రెండురోజులు అపరాహ్ణవ్యాప్తిగా ఉంటే శ్రాద్ధమును రెండవరోజే చేయాలి.అంటే ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు పంచమితిథి ప్రారంభమై మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతే తర్వాతిరోజే శ్రాద్ధము చేయాలి.రెండవరోజు తిథివృద్ధి ఉండుటచేత అలాగే పార్వణశ్రాద్ధస్య అపరాహ్ణః కర్మకాలః, కుతపః ప్రారంభకాల ఇతి తదుభయవ్యాపినీ తిథిర్గ్రాహ్యా అను జయసింహకల్పద్రుమాది వచనముల చేత రెండవరోజునే శ్రాద్ధమును చేయాలి.
- రెండురోజులు హెచ్చుతగ్గులుగా అపరాహ్ణమందు ఉండుట
రెండురోజులలో హెచ్చుతగ్గులుగా అపరాహ్ణమందుంటే ఏరోజు అపరాహ్ణమందు తిథి ఎక్కువగా ఉంటుందో ఆరోజును గ్రహించాలి.అంటే ముందురోజు 3 గంటలకు పంచమితిథి ప్రారంభమై మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళిపోతే మరుసటిరోజు అపరాహ్ణసమయములో తిథి ఎక్కువగా ఉన్నది కాబట్టి శ్రాద్ధము మరుసటిరోజునే చేయాలి.
- రెండురోజులు ఒకే విధముగా అపరాహ్ణమందు ఉండుట
రెండు రోజులలో అపరాహ్ణములో ఒకే విధంగా తిథి ఉంటే 2వ రోజు తిథి (ఉత్తరతిథి) యొక్క ప్రమాణము తగ్గినచో ముందు రోజున , తిథి ప్రమాణం సమానముగా లేదా ఎక్కువగా ఉన్నచో మరుసటి రోజున శ్రాద్ధము చేయాలి.
- రెండురోజులయందు అపరాహ్ణమందు లేకపోవుట
రెండురోజులలో అపరాహ్ణమందు తిథిలేకపోతే రెండవరోజునే శ్రాద్ధమును చేయాలి. పార్వణశ్రాద్ధములకు కుతపః ప్రారంభకాలః అను న్యాయముననుసరించి అపరాహ్ణములో తిథిలేనప్పటికీ కుతపకాలయుక్తమైన తిథినే గ్రహించాలి.అంటే ముందురోజు 7 గంటలకు పంచమితిథి ప్రారంభమై మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోతే మరుసటిరోజు సూర్యోదయానికి తిథి ఉండటం చేత రెండవరోజునే శ్రాద్ధమును చేయాలి.
జ.భార్యరజస్వల అయితే సకృన్మహాలయమును చేయరాదు.భాద్రపదకృష్ణపక్ష పాడ్యమి నాటి నుండి అమావాస్య వరకు వచ్చే తిథులలో చతుర్దశిని విడిచిపెట్టి ఏ రోజైననూ సకృన్మహాలయమును చేయవచ్చునని స్మతులలో చెప్పబడటం చేత భార్యరజస్వల కాని రోజున శ్రాద్ధమును చేయాలి. అమావాస్యనాడు సకృన్మహాలయమును చేయుటకు సంకల్పించి, ఆరోజు భార్యరజస్వల అయితే ఆశ్వయుజ శుక్లపంచమిలోపు శ్రాద్ధమును చేయవచ్చు. పక్షమహాలయము చేసేటప్పుడు మొదటిరోజు వంటప్రారంభించక ముందే రజస్వలైతే పంచమి మొదలగు కాలములలో శ్రాద్ధమును ఆరంభించాలి. వంటప్రారంభించిన తర్వాత రజస్వలైతే ఆమెను వేరే ఇంటిలో ఉంచి మహాలయశ్రాద్ధమును ఆచరించాలి.
జ.పక్షమహాలయము చేసేటప్పుడు ద్వితీయాదితిథులలో అశౌచము ప్రాప్తిస్తే ప్రారబ్ధే సూతకం నాస్తి అను వచనములు ఏవి కూడా పక్షమహాలయవిషయమునకు సంబంధించినవి కావు కాబట్టి ముందు చేసిన శ్రాద్ధములకు ఫలితముండదు.అందుచేత అశౌచశుద్ధిజరిగిన తరువాత ఆశ్వయుజ అమావాస్యలోపున సకృన్మహాలయమును చేయాలి.భాద్రపదశుద్ధములోనే అశౌచము వస్తే శుద్ధిజరిగిన తరువాత గౌణకాలములలో (తులాసంక్రమణప్రర్యంతకాలములలో) శ్రాద్ధము చేయవలెను. అశౌచము కాక వేరే ప్రతిబంధకము కలిగితే ప్రతినిధిద్వారా పక్షమహాలయమును చేయించాలని కాలతత్త్వవివేచనకారుని అభిప్రాయము.ధర్మసింధువులో కూడా పై విధంగానే చెప్పబడింది.
జ.తండ్రి సంన్యసించియుండగా లేక పతితుడైయుండగా (హైందవ-ధర్మమును విడిచిపెట్టినచో) మహాలయశ్రాద్ధమును చేయవలెనా లేక తండ్రి జీవించి ఉండగా అధికారము లేదని మానటమా అన్న సంశయము వస్తే వృద్ధౌ తీర్థే చ సన్యస్తే తాతే చ పతితే సతి యేభ్య ఏవ పితా దద్యాత్ తేభ్యో దద్యాత్స్వయం సుతః అను ప్రమాణముచే ఆబ్దికాలను ఎలా అయితే చేస్తున్నాడో అలాగే మహాలయశ్రాద్ధమును కూడా ఆచరించాలి. కానీ
ముండనం పిండదానం చ ప్రేతకర్మ చ సర్వశః
న జీవత్పితృకః కుర్యాత్ గుర్విణీ పతిరేవ చ॥
అను వచనముననుసరించి జీవత్పితృకునకు(తండ్రి జీవించియుండి, తల్లి మరణించినచో అతడు జీవత్పితృకుడు) పిండదానము నిషిద్ధము కాబట్టి సంకల్పవిధిగా మహాలయశ్రాద్ధమును ఆచరించాలి.
జ.మహాలయపక్షములో ఆబ్దికము చేయవలసి వస్తే సకృన్మహాలయమును, ఆబ్దికమును ఒకరోజు చేయకూడదు.కాబట్టి ఆబ్దికమును చేసిన తరువాత సకృన్మహాలయమును వేరే తిథినాడు చేయాలి. పక్షమహాలయము చేయు సందర్భమున ఆబ్దికము చేయవలసినవస్తే ముందు ఆబ్దికమును చేసి, స్నానం చేసి వేరే పాకమును చేసి మహాలయమును చేయాలి.పక్షమహాలయము చేసేటప్పుడు అమావాస్య నాడు ఆబ్దికము,దర్శశ్రాద్ధము కూడా చేయవలసివస్తే ముందుగా ఆబ్దికమును చేసి, వేరే వంటతో మహాలయమును చేసి, వేరే వంటతో దర్శశ్రాద్ధమును చేయాలి.అంటే మూడు శ్రాద్ధములను ఆబ్దికము-మహాలయము-దర్శ అను క్రమముగా వేరు వేరు వంటలతో చేయాలి. సకృన్మహాలయమైనా ఈ విధముగానే చేయాలి.మహాలయమును, దర్శశ్రాద్ధమును కూడా ఇలాగే మహాలయమును ఆచరించి వేరే వంటతో దర్శశ్రాద్ధమును చేయాలి.
జ.ధర్మశాస్త్రగ్రంథములలో తండ్రి మరణించిన మొదటి సంవత్సరములో మహాలయమును కొందరు చేయవచ్చని,కొందరు చేయరాదని చెప్తున్నారు. ధర్మసింధువులో పిత్రోర్మరణే ప్రథమాబ్దే మహాలయః కృతాకృతః అనియున్నది. కానీ శాస్త్రమందు ఈ విధంగా ఉందిః
ప్రమీతౌ పితరౌ యస్య దేహస్తస్యాశుచిర్భవేత్
న దైవం నాపి పిత్య్రం చ యావత్పూర్ణో న వత్సరః॥
అంటే తల్లిదండ్రులు మరణించిన సంవత్సరములో దైవ,పితృ-కర్మలలో అధికారములేదని అర్థము. కర్మాశౌచము, క్రియాశౌచము అనునవి సపిండీకరణముచే తొలగిపోయినప్పటికీ సంవత్సరాశౌచము సంవత్సరము పూర్తి అయ్యే వరకు ఉంటుంది.కాబట్టి దర్శశ్రాద్ధ, మహాలయశ్రాద్ధములు చేయుటకు కర్తకు అర్హత ఉండదు.ముందు తండ్రి మరణించి తదనంతరము తల్లి మరణించినచో తండ్రికి ప్రత్యాబ్దికములు సంవత్సరాశౌచమునందు కూడా చేయవచ్చును.తల్లికి సంవత్సరము పూర్తి అగువరకు ప్రేతత్వము పోదు.కాబట్టి తల్లినుద్దేశించి గయాశ్రాద్ధాదులను చేయరాదు.అంటే ఎవరు మరణించారో వారినుద్దేశించి మొదటి సంవత్సరములో శ్రాద్ధములను చేయరాదని అర్థము.కాబట్టి మహాలయమును చేయరాదు.
జ.మహాలయపక్షములో భరణీనక్షత్రయుక్తమైన రోజును మహాభరణీ అని అంటారు.ఈ రోజున శ్రాద్ధము చేసిన గయాశ్రాద్ధఫలితము కలుగుతుందని మత్స్యపురాణవచనము.
భరణీ పితృపక్షే తు మహతీ పరికీర్తితా
అస్యాం శ్రాద్ధం కృతం యేన స గయాశ్రాద్ధకృద్భవేత్॥
కామ్యశ్రాద్ధమైన దీనిని గయాశ్రాద్ధఫలములను కోరుకునేవారు ప్రతి సంవత్సరము సంకల్ప సహితముగా చేయాలి.
జ.జ.అవిధవానవమీశ్రాద్ధమనునది తల్లిమరణించినచో ఉపనయన సంస్కారం కానివాడు, జీవత్పితృకుడు (తండ్రి జీవించియుండి, తల్లి మరణించినచో అతడు జీవత్పితృకుడు) కూడా చేయవచ్చు.ఇందు విశ్వేదేవతలు పురూరవ-ఆర్ద్రవసంజ్ఞకులు.మాతృ-పితామహి- ప్రపితామహిలను ఉద్దేశించి శ్రాద్ధమును చేయాలి.సపత్నీమాత మరణించి, తల్లిజీవించనచో సపత్నీమాతృ-పితామహి-ప్రపితామహిలనుద్దేశించి చేయాలి.తల్లి-సపత్నీమాత ఇద్దరూ మరణించినచో వారిద్దరినీ ఉద్దేశించి, పితామహి-ప్రపితామహిలతో కలిపి పార్వణముగా ఈ శ్రాద్ధమును చేయాలి. మాతృసాపత్నీమాతలనుద్దేశించి చేయు సందర్భమున అర్ఘ్యపిండదానములు వేరు వేరుగా (మాతృసాపత్నీ-మాతరౌ-గోత్రే-పదే-వసురూపే ఇదం వాం అర్ఘ్యం స్వాహా నమః ఇత్యాదిగా) చెప్పి ఇవ్వాలి.తల్లి, సాపత్నీమాత ఇద్దరూ జీవించియుండగా మృతపితృకుడైననూ పితామహ్యాదులనుద్దేశించి అవిధవానవమీశ్రాద్ధమును చేయరాదు.తండ్రి మరణించిన తరువాత తల్లిమరణించినచో ఈ శ్రాద్ధమును చేయకూడదు.అలాగే శ్రాద్ధం నవమ్యాం కుర్యాత్తత్ మృతే భర్తరి లుప్యతే అను వచనముచే తండ్రికంటే ముందే తల్లిమరణించిననూ కాలాంతరమున తండ్రిమరణించిన తరువాత తల్లినుద్దేశించి ఈ శ్రాద్ధమును చేయకూడదని కొన్ని గ్రంథములందున్నది.నిర్ణయసింధువులో తదేతన్నిర్మూలత్వాన్మూర్ఖప్రతారణ-మాత్రమ్ అని చెప్పబడినది.దేశాచారతో వ్యవస్థా అని గ్రంథములలో చెప్పుటచేత ఈ విషయమున దేశాచారమే పాటించాలి.ఈ శ్రాద్ధమును జీవత్పితృకుడు, గర్భిణీపతి(గర్భవతియైన స్త్రీ యొక్క భర్త) కూడా పిండయుక్తముగానే చేయాలి. భాద్రపదకృష్ణపక్షములో నవమినాడు ఈ శ్రాద్ధము చేయలేకపోతే వృశ్చికరాశిలో సూర్యుడున్నంతవరకు (వృశ్చికసంక్రమణము వరకు) గౌణకాలములో చేయవచ్చు. ప్రత్యాబ్దికములో చేస్తున్నట్లుగా ఈ నవమీశ్రాద్ధ-మందు కూడా సువాసినికి భోజనము పెట్టాలి.సువాసినీచనిపోతే ఆబ్దికాదులలో సువాసినికి భోక్తలతో కూడి భోజనము పెట్టవలెననుటకు ప్రమాణము మార్కండేయోక్తముగా ధర్మశాస్త్రగ్రంథములలో ఈ విధముగా ఉన్నది-
భర్తురగ్రే మృతా నారీ సహ దాహేన వా మృతా
తస్యాః స్థానే నియుంజీత విప్రైః సహ సువాసినీమ్॥
జ.భాద్రపదకృష్ణపక్షములో త్రయోదశినాడు శ్రాద్ధము అతిప్రశస్తము.ఈ శ్రాద్ధము మహాలయమునకు భిన్నమైనది.ఈ శ్రాద్ధమందు సపత్నీక-పితృవర్గమును, సపత్నీకమాతామహవర్గమును పూజించాలి. త్రయోదశినాడు శ్రాద్ధమును చేయరాదని చెప్పే శాస్త్రవచనములు
కృష్ణపక్షే త్రయోదశ్యాం యః శ్రాద్ధం కురుతే నరః
పంచత్వం తస్య జానీయాత్ జ్యేష్ఠపుత్రస్య నిశ్చితమ్॥
ఇత్యాదిగా ధర్మశాస్త్రగ్రంథములలో ఋషులచేత చెప్పబడింది.అలాగే త్రయోదశినాడు తప్పక శ్రాద్ధము చేయాలని చెప్పే శాస్త్రవచనములు
త్రయోదశీ భాద్రపదీ కృష్ణా ముఖ్యా పితృప్రియా
తృప్యన్తి పితరస్తస్యాం స్వయం పంచశతం సమాః॥
త్రయోదశినాడు శ్రాద్ధము చేయకపోతే పాపము కలుగుతుందని చెప్పే విషయములు
ప్రోష్ఠపద్యామతీతాయాం తథా కృష్ణత్రయోదశీ
………………………………………
ఏతాంస్తు శ్రాద్ధకాలాన్ వై నిత్యానాహ ప్రజాపతిః॥
శ్రాద్ధమేతేష్వకుర్వాణో నరకం ప్రతిపద్యతే॥
ఆపస్తంబోపి-
త్రయోదశే బహుపుత్రో బహుమిత్రో దర్శనీయాపత్యః యువమారిణస్తు భవన్తి
ఇలా త్రయోదశీశ్రాద్ధమునకు విధినిషేధములు ఉన్నాయి.
శంఖధరునిచే ఈ విధముగా చెప్పబడినది.
మఘాత్రయోదశీశ్రాద్ధవిధివాక్యాని వర్గోద్దేశేనానుష్ఠీయమానం శ్రాద్ధమాశ్రయన్తే నిషేధాస్త్వేకవర్గోద్దేశేనానుష్ఠీయమానం శ్రాద్ధమాశ్రయన్తే
అత ఏవ కార్ష్ణాజినిః
శ్రాద్ధం నైవైకవర్గస్య త్రయోదశ్యాముపక్రమేత్
న తృప్తాస్తత్ర యే యస్య ప్రజాం హింసంతి తత్ర తే॥
అర్థముః-ముందు చెప్పబడిన త్రయోదశీ శ్రాద్ధనిషేధవచనములన్ని కేవల పితృవర్గమును ఉద్దేశించి చేయు శ్రాద్ధమును నిషేధించేవి.అలాగే త్రయోదశినాడు పితృతృప్తికై శ్రాద్ధమును తప్పక చేయాలని,చేయకపోతే నరకము ప్రాప్తిస్తుందన్న వచనములన్ని కూడా సపత్నీకపితృ-సపత్నీకమాతామహశ్రాద్ధమును చేయాలని చెప్తున్నాయి.అంటే త్రయోదశినాడు కేవల పితృశ్రాద్ధమును లేక సపత్నీకపితృశ్రాద్ధమును చేయరాదు.సపత్నీకపితృ-సపత్నీకమాతామహ- యుక్తమైన షడ్దేవతాకమైన శ్రాద్ధమును చేయాలని,చేయకపోతే ముందు చెప్పిన దోషము కలుగునని స్మృతివచనముల అర్థము.
జ.గజచ్ఛాయాశ్రాద్ధమనేది పితృదేవతలకు అత్యంత తృప్తిని కలిగిస్తుంది.ఈ శ్రాద్ధమును సూర్యుడు హస్తానక్షత్రమునందు ఉండగా మఖాయుక్తత్రయోదశినాడు చేయాలి.ఈశ్రాద్ధము భాద్రపద- కృష్ణపక్షములో వస్తుందని మనకి ప్రమాణవచనము ఈ విధముగా ఉన్నది:
సూర్యే హస్తస్థితే చంద్రాధిష్ఠితాభిః మఘాభిః త్రయోదశ్యా యోగో గజచ్ఛాయాసంజ్ఞకః స చ భాద్రపదాపరపక్షే సంభవతి॥
ఈ శ్రాద్ధమును చేయటంచేత పితృదేవతలు ఆనందించి సంతానాదిఫలములను ఇస్తారని శంఖాదిఋషులచే చెప్పబడింది.ఈ శ్రాద్ధము నిత్యము.సాధారణముగా అన్ని శ్రాద్ధములను ఒక కుటుంబంగా కలిసి ఉండే సోదరులు అందరూ కలిసి చేయాలి.కానీ ఒక కుటుంబంగా కలిసి ఉండే సోదరులు కూడా ఈ శ్రాద్ధమును విడిగా చేయాలని నిర్ణయసింధు,స్మృతికౌస్తుభాది గ్రంథములలో ఉన్నది.ఈ శ్రాద్ధమునందు ధురివిలోచనసంజ్ఞకులు విశ్వేదేవతలు.పితృదేవతలకు అత్యంతప్రీతిపాత్రమైన ఈ శ్రాద్ధమును తప్పక చేయాలి.
జ.మహాలయపక్షములో వచ్చు చతుర్దశినాడు తన తండ్రి చనిపోయినప్పటికీ ఆ తిథినాడు సకృన్మహాలయమును చేయరాదు.పక్షమహాలయమును చేస్తున్నట్లయితే చతుర్దశీతిథినాడు కూడా శ్రాద్ధమును చేయవచ్చు.అలాగే పౌర్ణమి నాడు మృతిచెందిన వారికి భాద్రపద పౌర్ణమి నాడే చేయవలెనని చెప్పినప్పటికీ అది కృష్ణపక్షం కాదు కాబట్టి చతుర్దశీ – పౌర్ణమి యందు మరణించిన వారికి భాద్రపదమాస కృష్ణ పక్షములో వచ్చే ద్వాదశినాడే శ్రాద్ధము చేయవలెను.
జ.భాద్రపదకృష్ణపక్షములో వచ్చు చతుర్దశికి శస్త్రహతచతుర్దశీ అని ధర్మశాస్త్రవ్యవహారము. వాచస్పత్యమందు శస్త్రహతోద్దేశ్యకశ్రాద్ధాంగం చతుర్దశీ అని అర్థము చెప్పబడింది. శస్త్రములచే ఎవరైతే మరణిస్తారో వారినుద్దేశించి మాత్రమే ఈ తిథినాడు శ్రాద్ధమును చేయాలి.కేవలము శస్త్రము చేత మరణించిన వారికి మాత్రమే కాక విషాదులచే మరణించినవారికి కూడా ఈ రోజు శ్రాద్ధము చేయాలి.
అత్ర మరీచిః
విషశస్త్రశ్వాపదాహితిర్యగ్బ్రాహ్మణఘాతినామ్
చతుర్దశ్యాం క్రియా కార్యా అన్యేషాం తు విగర్హితా॥
సంగ్రహే చ-
వృక్షారోహణలోష్టాద్యైర్విద్యుజ్జ్వాలావిషాదిభిః
నఖిదంష్ట్రివిపన్నానాం తేషాం శస్తా చతుర్దశీ॥
అర్థము-విష-జల-అగ్ని-శస్త్రములచే, సర్పముచేత, శృంగములు దంతములుకల క్రూరజంతువులచేత, విద్యుత్తుచేత మరణించినవారికి, ప్రమాదవశాత్తు పర్వతాదులనుండి పడి చనిపోయినవారికి, ఆత్మత్యాగము చేసుకొన్నవారికి, దుర్మరణమునొందినవారికి చతుర్దశినాడు శ్రాద్ధము చేయాలి. అంటే శాస్త్రములో విధింపబడిన నిమిత్తములలో చనిపోయిన వారికి మాత్రమే (ప్రమాదముచే మరణించినవారికి) శ్రాద్ధము చేయాలి. సర్పములచేతగానీ, క్రూరజంతువులచేత గానీ ప్రదర్శనలు చేస్తూ చనిపోయిన వారికి శస్త్రహతశ్రాద్ధము చేయకూడదు.అలాగే మరీచి-వాక్యమందున్న బ్రాహ్మణఘాతినామ్ అను వచనమునచే బ్రాహ్మణునిచే శస్త్రమును ఉపయోగించి చంపబడినవాడను అర్థమును తీసుకోరాదు. బ్రాహ్మణశాపముచే మరణించినవాడను అర్థమును తీసుకోవాలి.
శస్త్రహతస్యైకోద్దిష్టమేవ
శస్త్రహతుడైన తండ్రినుద్దేశించి చేసే శ్రాద్ధమును ఏకోద్దిష్టముగా చేయాలి.పార్వణవిధానముగా ఈ శ్రాద్ధమును చేయకూడదు.ఏకోద్దిష్ట-శ్రాద్ధమునకు సాధారణముగా చెప్పబడిన
ఏకోద్దిష్టం దైవహీనమేకార్ఘై్యక-పవిత్రకమ్ ఆవాహనాగ్నౌకరణరహితం హ్యపసవ్యవత్॥ ఉపతిష్ఠతామితి వదేత్ స్థానే విప్రవిసర్జనే అభిరమ్యతామితి వదేత్ బ్రూయుస్తేభిరతాస్మః॥
అను ధర్మములు వర్తించవు.అలాగే ఈ శ్రాద్ధమును దేవయుక్తముగా చేయాలని ప్రయోగపారిజాతమందు చెప్పబడింది-
ప్రేతపక్షే చతుర్దశ్యామేకోద్దిష్టం విధానతః
దేవయుక్తం తు తచ్ఛ్రాద్ధం పితౄణామక్షయం భవేత్॥
తచ్ఛ్రాద్ధం దైవహీనం చేత్పుత్రదారాధనక్షయః॥
పై ప్రమాణముచే శస్త్రహతుడైన తండ్రినుద్దేశించి ఒకబ్రాహ్మణుని, విశ్వేదేవతలనుద్దేశించి ఒకబ్రాహ్మణుని, విష్ణువునుద్దేశించి ఒకబ్రాహ్మణుని నిమంత్రించాలని స్పష్టమవుతోంది.
కాబట్టి ముందు చెప్పిన శస్త్రాదినిమిత్తములచే తండ్రి మరణిస్తే తదుద్దేశ్యముగా ఏకోద్దిష్టశ్రాద్ధము చేయాలని తెలిసింది.
జ.భాద్రపదకృష్ణచతుర్దశికి శస్త్రహతచతుర్దశి అను మరొక పేరు కలదు.అంటే శస్త్రము చేత మరణించినవారికి ఈ తిథినాడు శ్రాద్ధము చేయాలని అర్థము.అలాగే ఏకోద్దిష్టముగా చేసే ఈ శ్రాద్ధమున శస్త్రము చేత మరణించిన వారందరికీ ఏకోద్దిష్టము చేయాలి.కాబట్టి పితామహుడు శస్త్రము చేత మరణిస్తే అతనికి కూడా ఏకోద్దిష్టముగా శ్రాద్ధము చేయవలెను.శంఖఋషిచేతనూ ఏకస్మిన్ ద్వయోర్వా ఏకోద్దిష్టవిధిః అని చెప్పబడింది.అలాగే నిర్ణయసింధువందు పితామహోపి శస్త్రహతశ్చేదేకోద్దిష్టద్వయం కార్యమ్ అని ఉన్నది.అనగా పితృ-పితామహులు ఇద్దరూ శస్త్రము చేత మరణిస్తే ఇద్దరికీ ఏకోద్దిష్టముగా శ్రాద్ధము చేయాలి.అపుడు విశ్వేదేవస్థానము, పితృస్థానము, పితామహస్థానము, విష్ణుస్థానములలో బ్రాహ్మణులను నిమంత్రించి శ్రాద్ధమును చేయాలి.
ప్రపితామహే శస్త్రహతే…
పితృ-పితామహులవలె ప్రపితామహుడు కూడా శస్త్రము చేత మరణిస్తే అతనిని ఉద్దేశించి కూడా ఏకోద్దిష్టము చేయాలని మాధవ,దేవస్వామి, మదనపాల,రఘునాథభట్టాదుల అభిప్రాయము. పిత్రాదులు ముగ్గురూ శస్త్రము చేత మరణిస్తే పార్వణశ్రాద్ధమును ఆచరించాలని హేమాద్రి, దేవనభట్ట, అనంతదేవ,అపరార్క,కమలాకరభట్ట,కాశీనాథోపాధ్యాయాదుల అభిప్రాయము.ఇచట పితృ-పితామహ-ప్రపితామహులు ముగ్గురూ శస్త్రము చేత మరణించినప్పటికీ ఏకోద్దిష్టమే చేయాలని చెప్పుటకు కారణము ‘‘ముగ్గురూ మరణించినచో పార్వణము చేయమని చెప్పు ప్రమాణము లేకపోవుటవలన’’ అని దేవస్వామి అభిప్రాయము.హేమాద్రియందు ఆ విషయాన్ని ఈ విధముగా చెప్పారు –
త్రిష్వపి శస్త్రాదిహతేషు పృథగేకోద్దిష్టత్రయమేవ కార్యమ్, న తు పార్వణమ్, ఆహత్య వచనాభావాత్॥
కానీ స్మృతిసారోద్ధారాదిగ్రంథములలో పార్వణవిధాయకమైన ప్రమాణము ఈ విధముగా చెప్పబడింది.
పిత్రాదయస్త్రయో యస్య శస్ర్తైర్యాతాస్త్వనుక్రమాత్
స భూతే పార్వణం కుర్యాదాబ్దికాని పృథక్ పృథక్॥
శ్రాద్ధప్రకాశే చ –
ఏకస్మిన్ వా ద్వయోర్వాపి విద్యుచ్ఛస్త్రేణ వా హతే
ఏకోద్దిష్టం సుతః కుర్యాత్త్రయాణాం దర్శవద్భవేత్॥
కాబట్టి పితృ-పితామహ-ప్రపితామహులు మువ్వురూ శస్త్రము చేత మరణిస్తే శస్త్రహతచతుర్దశినాడు వారిని ఉద్దేశించి పార్వణవిధానముగా విశ్వేదేవ-పితృ-విష్ణుస్థానయుక్తమైన శ్రాద్ధమును చేయాలి.
పితృ-ప్రపితామహయోః శస్త్రహతయోః….
పితృ-ప్రపితామహులిద్దరూ శస్త్రము చేత మరణించి, పితామహుడు సాధారణముగా మరణిస్తే పితృ-ప్రపితామహులిద్దరినుద్దేశించి ఏకోద్దిష్టశ్రాద్ధమును చేయాలి.పితామహునకు శ్రాద్ధమును చేయరాదు.అనగా విశ్వేదేవ-పితృ-ప్రపితామహ-విష్ణుస్థానయుక్తమైన శ్రాద్ధమును ఏకోద్దిష్టముగా చేయాలి.
అదే విధముగా మాతృవర్గములో ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన శస్త్రాది నిమిత్తములచే మరణించారో వారికి కూడా పితృవర్గమునందు చెప్పబడిన క్రమముగా ఏకోద్దిష్టశ్రాద్ధమును చేయాలి.అంటే తల్లి-తండ్రులిద్దరూ శస్త్రము చేత మరణిస్తే వారినిద్దరినుద్దేశించి ఏకోద్దిష్టశ్రాద్ధమును దేవయుక్తముగా చేయాలి.అలాగే తల్లి, పితామహుడు శస్త్రము చేత మరణిస్తే వారిద్దరిని ఉద్దేశించి మాత్రమే శ్రాద్ధము చేయాలి.కారుణ్యవర్గములో సంతానములేక, దుర్మరణముచెందినవారందరికీ ఏకోద్దిష్టముగా శ్రాద్ధమును చేయాలి. ఈ విధముగా శస్త్రాదినిమిత్తములచే మరణించినవారికి మాత్రమే ఈ శస్త్రహతచతుర్దశీయందు శ్రాద్ధము చేయాలన్న ప్రమాణము వర్షకృత్యదీపికయందు ఇలా ఉన్నది-
శ్రాద్ధం శస్త్రహతస్యైవ చతుర్దశ్యాం మహాలయే॥
కొందరు చతుర్దశియందే శస్త్రహతులకు శ్రాద్ధమని చెప్పుచున్నారు.‘‘వసంతే బ్రాహ్మణో-గ్నీనాదధీత’’అను వచనమువలె ‘‘శస్త్రహతునకు మాత్రమే చతుర్దశియందు శ్రాద్ధమునాచరించవలె’’, ‘‘చతుర్దశియందే శస్త్రహతునకు శ్రాద్ధము చేయవలె’’అను సమన్వయమును చెప్పుచున్నారు.అందువలన శస్త్రహతునకే చతుర్దశియందు శ్రాద్ధము అను అర్థమును గ్రహించవలెను.
జ.శస్త్రములచేత మరణించిన వారికి భాద్రపదకృష్ణపక్షములో వచ్చు చతుర్దశి నాడు శ్రాద్ధమును చేయాలి అనటానికి గల కారణమును పురాణముల యందు ఈ విధముగా చెప్పబడినది.
పూర్వము హిరణ్యాక్షుడను రాక్షసుడు బలాన్వితుడై సర్వదేవతలను పీడిస్తూ ఉండేవాడు.అతడు బ్రహ్మదేవుని అనుగ్రహముకై ఘోరమైన తపస్సును చేశాడు.అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ భాద్రపదకృష్ణచతుర్దశి-నాడు ప్రత్యక్షమై ‘‘నీ తపస్సుకు సంతుష్టుడనైతిని.నీకు ఏ వరము కావాలో కోరుకొనుము. దేవదానవులకు ఇవ్వకూడనిదైనా నీకు ఇచ్చెదను’’ అని పలికెను.అంతట హిరణ్యాక్షుడు ‘‘హే పితామహ!భూత-ప్రేత-పిశాచ-రాక్షస-దైత్య-దానవులందరూ అన్నార్తులై నన్ను నిత్యము ఆహారము అడుగుచున్నారు.సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన ఈ భాద్రపద కృష్ణపక్షం పితృపక్షం అగుచున్నది. కావున ఈ పక్షములో చతుర్దశి నాడు వారిని ఉద్దేశించి చేసిన శ్రాద్ధము చేత వారికి సంవత్సరపర్యంతము తృప్తికలుగునటుల అనుగ్రహింపుము’’ అని ప్రార్థించెను.అంతట బ్రహ్మ‘‘ఏ మానవుడైతే తన పితృదేవతలనుద్దేశించి ఈ రోజున శ్రాద్ధమును చేయునో ఆశ్రాద్ధము ప్రేతాదులకు తృప్తిని కలుగజేయున’’ని పలికి అంతర్ధానమయ్యెను.
ఎవరైతే శస్త్రములచేత, అకాలమరణముచేత, విషాదులచేత దుర్మరణమును పొందినారో వారికి ప్రేతత్వము కలుగును.కావున వారి తృప్తికై చతుర్దశినాడు శ్రాద్ధమును ఆచరించాలి.‘‘హిరణ్యాక్షుడు కోరినవిధముగా బ్రహ్మదేవుడు భాద్రపదకృష్ణచతుర్దశినాడు వరమిచ్చుట వలన శస్త్రములచేత మరణించిన వారికి చతుర్దశినాడు శ్రాద్ధమును చేయవలెనని’’ ధర్మశాస్త్రములయందు చెప్పబడింది.
జ.సాధారణముగా స్మృతులలో సపిండీకరణము చేసిన తరువాత ఏకోద్దిష్టశ్రాద్ధము చేయరాదని ఈ విధముగా చెప్పబడింది-
కార్ష్ణాజినిః-
అత ఊర్ధ్వం న కర్తవ్యమేకోద్దిష్టం కదాచన
సపిండీకరణాంతం చ ప్రేతస్యైతదమంగళమ్॥
మాధవీయే-
ప్రదానం యత్ర యత్రైషాం సపిండీకరణాత్పరమ్
తత్ర పార్వణవచ్ఛ్రాద్ధం ఏకోద్దిష్టం త్యజేద్బుధః॥
జాతూకర్ణిః-
ప్రేతత్వాచ్చైవముత్తీర్ణః ప్రాప్తః పితృగణం తు సః
చ్యవతే పితృలోకాత్తు పృథక్పిండేన యోజితః॥
ఈ విధముగా సపిండీకరణాత్పరము ఏకోద్దిష్టవిధిగా శ్రాద్ధము చేయకూడదని, ఒకవేళ చేస్తే వసురూపత్వాన్ని పొందిన ప్రేత పితృలోకమునుండి పతితుడగుచున్నాడని (పితృత్వము పోతుందని), ఏకోద్దిష్టము చేసినట్లయితే ప్రేతకు అమంగళమని స్మృతులలో చెప్పబడింది. కాబట్టి ఏకోద్దిష్టము చేయరాదు అన్నట్లయితే –
గార్గ్యః-
చతుర్దశ్యాం తు యచ్ఛ్రాద్ధం సపిండీకరణాత్పరమ్
ఏకోద్దిష్టవిధానేన తత్కుర్యాచ్ఛస్త్రఘాతినామ్॥
భవిష్యత్పురాణే చ –
సమత్వమాగతస్యాపి పితుః శస్త్రహతస్య వా
చతుర్దశ్యాం తు కర్తవ్యమేకోద్దిష్టం మహాలయే1॥
ఇత్యాదిగా సపిండీకరణానంతరము కూడా ఏకోద్దిష్టము చేయాలని స్మృతివచనములు చెప్తున్నాయి విధినిషేధములున్న ఈ విషయములో ఏది ఆచరించాలి అన్న సంశయానికి స్కాందపురాణాంతర్గత నాగరఖండలో సపిండీకరణానంతరము ఏకోద్దిష్టముగా శ్రాద్ధము చేయుటకు కారణము ఇలా చెప్పబడింది.
అపమృత్యుగతానాం చ సర్వేషామేవ దేహినామ్
ప్రేతత్వం జాయతే యస్మాత్తస్మాత్తేషాం హి తద్దినమ్॥
శ్రాద్ధార్హం పార్థివశ్రేష్ఠ విశేషేణ ప్రకీర్తితమ్
ఏకోద్దిష్టం ప్రకర్తవ్యం తస్మాత్తత్ర దినే నరైః॥
సపిండీకరణాదూర్ధ్వం తత్తే వక్ష్యామి కారణమ్
యది ప్రేతత్వమాపన్నః కదాచిత్తత్పితా భవేత్॥
తృప్త్యర్థం తస్య కర్తవ్యం శ్రాద్ధం తస్య దినే నృప
పితామహాద్యాస్తత్రాహ్ని శ్రాద్ధం నార్హన్తి కుత్రచిత్॥
అథ చేత్ భ్రాన్తితో దద్యాత్ హ్రియతే రాక్షసైస్తు తత్
బ్రహ్మ్రణో వచనాద్రాజన్ భూతప్రేతైశ్చ దానవైః॥
తేనైకోద్దిష్టమేవాత్ర కర్తవ్యం న తు పార్వణమ్
పితృపక్షే చతుర్దశ్యాం కన్యాసంస్థే దివాకరే॥
ఏతస్మాత్ కారణాచ్ఛ్రాద్ధం పార్వణం న విధీయతే॥
తస్మిన్నహని సంప్రాప్తే వ్యర్థం శ్రాద్ధం భవేద్యతః॥
భావముః- యుద్ధమునందుశస్త్రము చేత మరణించిన వారికి(అపమృత్యువు పొందుట), యుద్ధమందు భయపడి వెనుతిరిగివచ్చినవారికి, అపమృత్యువును పొందినవారికి(శస్త్రాదులచేత మరణించిన వారికి)ప్రేతత్వము కలుగును. అటువంటి వారికి శ్రాద్ధము చేయుటకు భాద్రపదకృష్ణచతుర్దశి ప్రశస్తమైనది. ఆరోజున ఏకోద్దిష్టశ్రాద్ధమును వారి తృప్తికై చేయాలి. అలాకాక పార్వణవిధిగా శ్రాద్ధము చేసినట్లయితే భూత-ప్రేత-రాక్షసాదులచే ఆ శ్రాద్ధఫలము పొందబడుచున్నది. ఈ కారణము చేత వారికి ఏకోద్దిష్టశ్రాద్ధమునే చేయవలెను. ఆరోజున ఏకోద్దిష్టముగా కాక పార్వణవిధిగా చేసినచో (పితృ-పితామహ-ప్రపితామహులకు ముగ్గురికీ చేయునపుడు కాక తక్కిన శ్రాద్ధమును) ఆశ్రాద్ధము వ్యర్థమగును.
పైవచనములచేత భాద్రపదకృష్ణచతుర్దశినాడు శస్త్రములచేత మరణించిన వారికి ఏకోద్దిష్టశ్రాద్ధమే చేయాలని తెలుస్తోంది.
జ.భాద్రపదకృష్ణపక్ష చతుర్దశినాడు ఆబ్దికము చేయవలసి వస్తే చతుర్దశీశ్రాద్ధము చేసి ఆబ్దికము చేయాలని శ్రాద్ధసాగరాదిగ్రంథములలో చెప్పబడింది.
శ్రాద్ధహేమాద్రియందు-
అథ చతుర్దశీనిమిత్తకమేకోద్దిష్టం మృతాహనిమిత్తకం చ పార్వణమితి శ్రాద్ధద్వయం కుర్యాత్ ఏకమేవ వా అంగవైధర్మ్యాత్ గృహ్యమాణవిశేషత్వేన తంత్రానుష్ఠానాసంభవాత్ సంశయః
తత్ర సమానేహని నైకః శ్రాద్ధద్వయం కుర్యాత్ ఇత్యస్య నిషేధస్య భిన్ననిమిత్తకశ్రాద్ధగోచరత్వాభావాత్ శ్రాద్ధద్వయం కుర్యాత్
మైవమ్ దేవతైక్యాత్ ప్రధానద్వయస్య సహానుష్ఠానే భూయసాం శ్రాద్ధ-ధర్మాణాం అనుగ్రహాయ పార్వణధర్మైః ఏకోద్దిష్టధర్మబాధే పార్వణేన నైమిత్తికస్య సిద్ధౌ న భేదేన శ్రాద్ధద్వయానుష్ఠానమ్
అని చెప్పబడింది.
అంటే ఆబ్దికానుష్ఠానముతోనే చతుర్దశీశ్రాద్ధము సిద్ధిస్తుందని భావము. స్మృతికౌస్తుభాదిగ్రంథములలో కూడా ఈ విధం గానే చెప్పబడింది. కాబట్టి శస్త్రముల చేత మరణించిన వారికి చతుర్దశినాడు ప్రత్యాబ్దికము చేసినచో, శస్త్రహత-చతుర్దశినాడు చేయాల్సిన ఏకోద్దిష్టశ్రాద్ధము కూడా చేసినట్లవుతుంది.
జ.భాద్రపదకృష్ణపక్షములో శస్త్రహతచతుర్దశినాడు శస్త్రముల చేత మరణించిన తండ్రి మొదలైన వారినుద్దేశించి చేయాల్సిన చతుర్దశీశ్రాద్ధమును చేయలేకపోతే ఆశ్వీయుజకృష్ణపక్షములో పార్వణవిధిగా ఈ శ్రాద్ధమును చేయాలి. లోపస్య లోప ఏవ అను న్యాయముచే చతుర్దశినాడు చేయకపోతే చతుర్దశీ-నిమిత్తకశ్రాద్ధమునకు లోపమని చెప్పరాదు. భాద్రపదకృష్ణపక్షచతుర్దశినాడు చేస్తే ఏకోద్దిష్టముగా, ఆశ్వయుజకృష్ణపక్షములో చేస్తే పార్వణవిధిగా చేయాలన్న భేదము తెలియుచున్నది.
జ.సూర్యుడు హస్తానక్షత్రంలో ఉండగా చాంద్రహస్తానక్షత్రయుక్తమైన అమావాస్యను గజచ్ఛాయా అంటారు. ఈ గజచ్ఛాయ యందు కూడా పితృప్రీతికై శ్రాద్ధమును చేయాలి.
జ.ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు సపత్నీకమాతామహాదితృప్తికై దౌహిత్రుడు(కూతురి కొడుకు) శ్రాద్ధమును చేయాలి. ఈ శ్రాద్ధము ఉపనయన సంస్కారము కానివారు కూడా చేయవచ్చును.
జ.ఈ విషయము గురించి “ వీరమిత్రోదయ శ్రాద్ధ ప్రకాశము ” లో ఈ విధముగా చెప్పబడింది.
జాతమాత్రో-పి దౌహిత్రో విద్యమానే-పి మాతులే
కుర్యాన్మాతామహశ్రాద్ధం ప్రతిపదాశ్వినే సితే॥
అర్థముః- పై వచనమందు జాతమాత్రోపి దౌహిత్రో అని చెప్పబడటం వల్ల కేవలం తన కూతురుకు సంతానంగా పుట్టడం మాత్రం చేతనే అనుపనీతుడు అయిననూ ఇతడు ఈ శ్రాద్ధం చేయవచ్చునని తెలుస్తున్నది.విద్యమానేపి మాతులే అని చెప్పుటచే మేనమామ ఉన్నప్పటికిన్నీ ఈ శ్రాద్ధము చేయవలెను.ప్రతిపదాశ్వినే సితే అని చెప్పుటచే ఆశ్వయుజమాసశుక్లపక్ష-మందు సంగవకాలవ్యాపిని ఐన పాడ్యమి నాడు చేయవలెను.కుర్యాన్మాతామహశ్రాద్ధం అని ఉండుటచే మాతామహి జీవించియున్నచో కేవల-మాతామహవర్గమునకు చేయవలెను.ఇదం జీవత్పితృకేణాపి కార్యమ్ అను ధర్మసింధు కారుడి వచనముచే ఈ శ్రాద్ధము తండ్రి బ్రతికియున్నా కూడా చేయవలసినటువంటి శ్రాద్ధం అని స్పష్టమగుచున్నది. ఈ శ్రాద్ధమును ఆశ్వయుజశుద్ధపాడ్యమి నాడు చేయుటకు అశక్యమైనచో వృశ్చికసంక్రమణములోపు చేయవచ్చును.
జ.ప్రమాణ శ్లోకము- ఏకముద్దిశ్య యచ్ఛ్రాద్ధం ఏకోద్దిష్టం ప్రకీర్తితమ్ !
ప్రేత స్థానమును ఒక్క దాన్ని మాత్రమే ఉద్దేశించి చేయునది అని అర్థము.అంటే ఇక్కడ విశ్వే దేవతలు, పితామహాదులు మొదలగు వారిని గురించి అర్చనాదులు చేయకుండా కేవలం మరణించిన ప్రేతనుద్దేశించి చేయు శ్రాద్ధమును “ఏకోద్దిష్ట శ్రాద్ధము” అంటారు.ఈ ఏకోద్దిష్ట శ్రాద్ధములు సపిండీకరణ శ్రాద్ధముకు ముందు చేసేవి.
జ.1) ఏకోద్దిష్ట శ్రాద్ధాదుల్లో విశ్వేదేవ స్థానం ఉండదు.
2) ప్రేతావాహన చేయరాదు.
3) ఒకే దర్భ తో చేసిన పవిత్ర ఉంటుంది.
4) ఒకటే అర్ఘ్య పాత్ర ఉంటుంది.
5) అగ్నౌకరణం చేయకూడదు.
6) శ్రాద్ధము అంతా ప్రాచీనావీతిగానే చేయాలి.
7) అక్షయ్యోదక స్థానంలో ఉత్తిష్ఠతాం అని చెప్పాలి.
8) విప్ర విసర్జన సమయంలో అభిరమ్యతాం అని పలుకవలెను.
9) అధిశ్రవణం పారాయణం ఉండదు.
10) ధూప – దీపాలు లేవు.
11) స్వధా శబ్దమును ఉచ్ఛరింపకూడదు.
12) నమస్కారం చేయరాదు.
జ.ప్రమాణ శ్లోకము- త్రీనుద్దిశ్య తు యత్తద్ధి పార్వణం మునయో విదుః !
పితృ – పితామహ – ప్రపితామహులను ఉద్దేశించి చేయు త్రిపిండ శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధము అంటారు. ఈ పార్వణ శ్రాద్ధాలు సపిండీకరణము అయిన తరువాత చేసేవి.సంవత్సర దీక్షలో చేసే 16 మాసికములు,ఆ తరువాత చేసే ప్రత్యాబ్దికాలు అన్నీ కూడా పార్వణ విధానములే.
జ.ఏకోద్దిష్ట ధర్మాలు ఏవీ పార్వణ విధాన శ్రాద్ధాల్లో వర్తించవు.
జ.మహాలయ – తీర్థ శ్రాద్ధాల్లో కారుణ్య వర్గ పితరులు వస్తారు.వారు వరుసగా ఈ విధంగా ఉంటారు.
సుత , భ్రాతృ , పితృవ్యాశ్చ , మాతులాస్సహ భార్యకా: ! దుహితా , భగినీ చైవ , దౌహిత్రో , భాగినేయకః ! పితృష్వసా, మాతృష్వసా , జామాతా, భావుక , స్నుషా ! శ్వశుర, శ్యాలక , శ్వశ్రూ: , స్వామినో , గురు , రిక్థిన: !!
వీరిని కారుణ్య వర్గం అంటారు.
జ.వ్యక్తి మరణించిన తరువాత సంవత్సరం చివరిలో చేసే శ్రాద్ధాన్ని సపిండీకరణము అంటారు.అయితే కర్త యొక్క దేశ – కాల – దేహ – ధర్మముల దృష్ట్యా ఇది ప్రస్తుతం 12 వ రోజున చేయడం చూస్తూ ఉన్నాము.ఎందుకంటే కర్తకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ వచ్చినచో సంవత్సర అంతంలో ఈ శ్రాద్ధం చేయలేకపోతే ప్రేత కు ప్రేతత్వం పోకుండా పితృత్వం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.దానివల్ల ప్రేత శాపానికి గురై వంశాభివృద్ధి జరగదు.అందుకే 12 వ రోజు సపిండీకరణం చేసి ప్రేతకు విముక్తి కలిగించడం జరుగుతుంది.కర్తకు నియమాలు మాత్రం సంవత్సరం వరకూ ఉంటాయి.ముఖ్యంగా సపిండీకరణ శ్రాద్ధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరణించిన వ్యక్తికి ప్రేతత్వ విముక్తి అయి పితృత్వం రావడం కోసం.